Thursday, June 26, 2008

ఆ రాత్రి ---2

అన్నీ హద్దులు .ప్రేమ గాని,స్నేహంగాని,పరిచయంగాని,డబ్బుగాని -'ఇంతవరకు' అంతే అని, అంచులు చక్కగా కత్తిరించినట్లు సంబంధాలు పెట్టుకుంటారు. వాళ్ళకి కోపం యెన్నడూ రాదు.పైకి కనపడదు.నవ్వుతోనే గొంతు కత్తిరిస్తారు.ఆ తెగిన మనిషే భరించలేక వొచ్చి వాళ్ళ ముందే గోలెత్తితే "అట్లా చేస్తే ఇట్లానే జరుగుతుంది" అని తమకి సంబంధం లేనట్టు, ఆ శిక్ష ఈశ్వరుడి చట్టం ప్రకారం వాళ్ళ మీద పడ్డట్టు మాట్టాడతారు .వాళ్ళకే అపాయమూ రాదు.అపాయాలూ,నష్టాలూ,దురదృష్టాలు పట్టినవాళ్ళ మీద వాళ్ళకి స్వశక్తి మీద విశ్వాసం.ఈశ్వరుడంటే వాళ్ళకేమాత్రమూ గిట్టదు.వేరేశక్తి చాలా అవసరం వాళ్ళ అవసరాలకి.
దూరంనించి అపాయం వొస్తున్నట్లు తోచిందా,చల్లగా తప్పుకుని పక్కవారిమీదనించి అపాయాన్ని దొర్లి పోనిస్తారు.
ఇంకెవరూ లేకపోతే భార్యమీదనైనా సరే -ప్రియురాలు అసలు వుండనే వుండదు, ప్రేమ అంటే హేళన గనక. ప్రేమని యెరుగనే ఎరుగవు ఆ హృదయాలు.ఏ వుద్రేకం వల్లనన్నామనిషి కదిలి పట్టాలు తొలిగాడా,దాన్ని ఓ రోగమంటారు.

ఆ రాత్రి ఆ గదిలో కుర్చీలలో పడుకున్న పెద్దమనుష్యులిద్దరూ typical self-made men, కానీ వాళ్ళిద్దరి జీవితాల్లోనూ స్త్రీ మీద మమత ప్రభావం బలంగా పనిచెయ్యడం వల్ల టైపునించి విభేదించారు చెరోవిధంగాను.ఎటువంటి స్త్రీ అయినా సరే ,ప్రేమించిందంటే , ఆ పురుషుడి స్వభావంలో ,అతను మొత్తం మీద ఎంత నీచుడూ ,క్రూరుడైనా,ఒక భాగానికి ఓ ఔన్నత్యం పట్టి వుంటుంది. ఆ ప్రేమే పట్టుగా కొంతకాలం వాళ్ల జీవితాల్ని పరిపాలిస్తే క్రమంగా పెద్దమృదువైన మార్పు కలుగుతుంది.ఎటువంటి కర్కశ స్వభావంలో కూడా కొంత విశాలత్త్వం ఏర్పడుతుంది.
ఆ గదిలో ఆ రాత్రి పదకొండు గంటలప్పుడు కుర్చీలలో హాయిగా పడుకున్న మిత్రులు ఇద్దరూ వయసు మల్లినవాళ్ళే.
చిన్నప్పుడు స్కూలులో కాలేజీలో కలిసి చదువుకున్నారు .ఆఇంటి యజమాని రిటైరైన లెక్చరరు శ్యామారావు.ఆయన అతిధి మిత్రుడు ,చాలా డబ్బు సంపాయించిన వకీలు రాజయ్య.కాలేజీలో విడిపడి, ముప్ఫై ఏళ్ళ చిల్లర తరువాత ఇదే కలుసుకోవడం వాళ్లు.రాజయ్య రెండో కూతురుకి సంబంధం చూడ్డానికి ఆ వూరు వొచ్చి తన మిత్రుడి ఇంటో దిగాడు.రెండో రోజు రాత్రి అది.
చుట్ట కాలుస్తూ ఉమ్మేసుకోడానికని లేచి రాజయ్య " On such a night as this- జ్ఞాపకముందా?" అంటో వొచ్చి కుర్చీలో పడుకున్నాడు, పై కప్పువేపు పొగ వదులుతో కొంచెం సేపు మాటాడలేదు ఎవరూ. నిశ్శబ్దం నాలుగు నిముషాలే .కానీ ఏళ్ళ జ్ఞాపకాలు!

పక్కన రైలుకట్ట .దానిమీద వంతెన కిందనించి దొల్లుకొంటూ వచ్చే పంట కాలవ.వెన్నెట్లో ఆ నీళ్ళన్నీపాలైనాయి. కాలవకట్టన పొగడచెట్టు.దానికింద ముగ్గురు మిత్రులూ సహధ్యాయులూ అట్లాంటి కార్తీకపు వెన్నెల రాత్రి -మధ్య విశాలాక్షి .చెరొక పక్కన వీరిద్దరూ హుషారైన యువకులు-ఎన్నేళ్ళ కిందటో .ఆ రాత్రి ముగ్గురూ తోడి రాగం లో పాడారు.షేక్సుపియరు ఇంగ్లీషు పాటని -On such a night as this - అని తప్పులతో ముగ్గురూ కంఠాలు కలిపి.కాని రెండు కంఠాలు కలవడం సులభం గాని మూడు కలవ్వు.
అసలు మొదట శ్యామారావుకి విశాలాక్షి కీ స్నేహం.చదువుకొనే స్త్రీలని స్వాతంత్రురాళ్ళైన వారినీ చూస్తీ అతనికి fancy( ఫాంసీ) అందుకని ఆమెకి తన నోట్సు ఇవ్వడమూ,ఆమెకి చదువు విషయమై సలహాలు ఇవ్వడమూ అతనికి సరదా.శని ఆది వారాలు ఆమె ఇంటికి వెళ్లి ఆమెని 'కోచ్ ' చేసే వాడు కూడా .అతని ఆప్త మిత్రుడు రాజయ్యకి ఇట్లాంటి స్నేహాలు యేమాత్రం గిట్టవు.కనుక మిత్రుణ్ణి warn(వార్న్) చేసి వారించాలని చూశాడు.కాని శ్యామారావు వినలేదు. త్వరలో విశాలాక్షి శ్యామారావుల పేర్లు గోడలమీది కెక్కాయి. వాళ్ళ పెద్దవాళ్ళకి ఆకాశరామన్న వుత్తరాలు వెళ్ళాయి. దాంతో వాళ్ళిద్దరికీ చాలా సిగ్గేసింది.తమ స్నేహాన్ని ఇట్లా అసహ్యంగా ప్రచురిస్తారని వాళ్లెప్పుడూ అనుకోలేదు.విశాలాక్షి కాలేజీ కి రాలేదు వరుసగా నాలుగు రోజులు.శ్యామారావు కి దిగులు పట్టుకుంది, తనమూలంగా విశాలాక్షి చదువు మానిపించారేమోనని .అంతే కాదు, ఆమెని చూడకుండా వుండలేనని అప్పుడే తెలియవచ్చింది.ఆమెని ఆమె తలిదండ్రులు ఏం బాధ పెడుతున్నారో! ఓ సాయంత్రం శ్యామారావు వాళ్ల ఇంటివేపుకి వెడితే,విశాలాక్షి తండ్రి అతడ్ని ఇంక ఆ ఇంటివేపు రావొద్దని కఠినంగా చెప్పాడు.శ్యామారావు డెస్పరేట్ ఐ తన మిత్రుణ్ణి విశాలాక్షి ఎలావుందో చూసి రమ్మని బతిమాలుకున్నాడు. చివరికి మత్రుడి అవస్తని భరించలేక వెళ్లడానికి వొప్పుకొన్నాడు,శ్యామారావు ఓ వుత్తరం కూడా ఇచ్చాడు.రాజ్య రాత్రికానిచ్చి వెళ్లి విశాలాక్షిని పిలిచాడు. వాళ్ల ఇంట్లో కొంచెం మాటాడి వుత్తరం ఇస్తో వుండగా విశాలాక్షి తండ్రి చూసి ఎవరో సరిగా గమనించకుండానే వుత్తరం లాక్కొని ,"నిన్ను ఇటు రావొద్దని చెప్పలేదురా? నా పిల్లని బతకనియ్యవా? " అంటో మెడపట్టుకుని గెంతాడు రాజయ్యని.అర్భకుడైన రాజ్య హఠాత్తయిన ఆ తోపులో గుమ్మంలో కింద పడ్డాడు.రాత్రి పదింటికి శ్యామారావు గదికి వచ్చి రాజయ్య తనకి జరిగినదంతా చెప్పాడు. ఆనాటినుంచి వారిద్దరి స్నేహమూ మరింత బలపడ్డది కాలేజీలో.
************************************************************
ఈ రాత్రి ,వాళ్ళిద్దరూ పూర్వం ఇలాంటి రాత్రే వాళ్లు ముగ్గురూ కూచొని పాడిన జ్ఞాపకం తెచ్చుకొంటున్నారు.

No comments: